
ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నెన్నో విచిత్రాలు చూస్తున్నాము. ఇప్పుడు ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా ఓ సినిమాయే వచ్చేసింది.
బెంగళూరుకి చెందిన నరసింహమూర్తి, ఏఐ నిపుణుడుగా మారిన నూతన్ అనే గ్రాఫిక్ డిజైనర్ కలిసి కేవలం రూ.10 లక్షలతో ఆరు నెలల్లో ‘లవ్ యూ’ అనే కన్నడ సినిమా తీయగా, సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో కూడా హీరో హీరోయిన్లు, మరో 13 మంది నటీనటులున్నారు. అన్ని సినిమాలలో లాగే దీనిలో కూడా పాటలు, డాన్సులు, ఫైట్స్ ఉన్నాయి.
కానీ ఈ సినిమాలో ఎవరూ నటించలేదు. ఎక్కడికి వెళ్ళి షూటింగ్ చేయలేదు. ఎవరూ పాటలు, డైలాగ్స్ వ్రాయలేదు. ఎవరూ సంగీతం సమకూర్చలేదు. వారిరువురూ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఏఐ ఒకటొకటి సృష్టిస్తూ ‘లవ్ యూ’ సినిమా తీసి కాపీ చేతిలో పెట్టింది!
మన దేశంలో ఏఐతో కాదు కాదు.. ఏఐ తీసిన తొలి సినిమా ఇదే! ఈ సినిమా భారత్ సినీ పరిశ్రమలో పెను మార్పులకు బీజం వేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా స్పూర్తితో ఇకపై వరుసపెట్టి ఏఐ సినిమాలు వస్తాయేమో? ఎవరి అవసరం లేకుండా ఏఐ సినిమాలు తీసేస్తుంటే మరి సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుందో?