ప్రకాష్ రాజ్ వాస్తవమే చెప్పారు కానీ...

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో సగం అధికార పార్టీకి అమ్ముడుపోయిందన్నారు. ఓ సినిమా తీసుకునేందుకు, చేసిన సినిమాని విడుదల చేసుకునేందుకు కూడా బాలీవుడ్‌ ప్రభుత్వాన్ని చూసి భయపడే పరిస్థితి దాపురించిందని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రభుత్వం అధికార బలంతో సినీ పరిశ్రమని గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తోందన్నారు. 

అందుకే బాలీవుడ్‌లో ఉన్నవారెవరూ ఏ అంశం మీద మాట్లాడేందుకు ఇష్టపడరని ఇది వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్చని హరించివేయడమే కదా?అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. తాను దేని గురించైనా చాలా నిర్భయంగా మాట్లాడుతుంటానని బాలీవుడ్‌లో మిత్రులు అంటారని, కానీ తాము ఆవిధంగా మాట్లాడలేమని వారే చెపుతుంటారని ప్రకాష్ రాజ్ అన్నారు. 

తాను ఈవిదంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కారణంగా, తనని సినిమాలలో తీసుకుంటే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే భయంతో చాలా మంది వెనక్కు తగ్గుతున్నారని, అందువల్లే గత కొంత కాలంగా తనకు సినిమా అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయని అన్నారు. కానీ అంత మాత్రాన్న తాను ప్రభుత్వాలని ప్రశ్నించడం మానుకోనన్నారు ప్రకాష్ రాజ్.       

ప్రకాష్ రాజ్ చెప్పింది వాస్తవమే అని అందరికీ తెలుసు. అయితే ఇది ఒక్క బాలీవుడ్‌కి మాత్రమే పరిమితం కాదు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్ ప్రతీ సినీ ఇండస్ట్రీ అధికార పార్టీల నుంచి ఒత్తిళ్ళు ఎదుర్కొంటూనే ఉంది. 

ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే ఆయన సినిమాలలో హీరోగా నటించడం లేదు. కనుక రాజకీయాల గురించి ఆయన ఏమైనా మాట్లాడగలుగుతున్నారు. ఒకవేళ ఆయనే హీరోగా సినిమాలు చేస్తున్నట్లయితే, తన సినిమాలు కాపాడుకోవడం కొరకు ఆయన కూడా తన అభిప్రాయాలను తనలోనే దాచుకుంటూ మౌనం వహించక తప్పదు కదా?