అఖండ-2లో ఆ బాలీవుడ్‌ నటుడు?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర చేస్తున్న అఖండ-2 షూటింగ్‌ కోసం చిత్ర బృందం జార్జియా దేశానికి బయలుదేరుతోంది. అక్కడ కొన్ని భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్ ఓ కీలకపాత్ర చేస్తున్నారని ఆయన కూడా జార్జియా షూటింగ్‌లో పాల్గొనేందుకు బయలుదేరుతున్నారని తెలుస్తోంది.

గత ఏడాది సంక్రాంతికి విడుదలైన అఖండ సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా మళ్ళీ బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో అఖండ-2 తీస్తున్న సంగతి తెలిసిందే. కనుక దీనిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. కనుక అఖండ-3 కూడా తీయాలని బోయపాటి-బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయం ఇంకా ధృవీకరించాల్సి ఉంది.   

అఖండ-2లో ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.         

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్‌ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.   

అఖండ-2ని సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించినందున దీని హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. జూన్ 10వ తేదీన అఖండ-2 టీజర్‌ విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం

 సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో అఖండ-2 నిర్మిస్తున్నారు.