శుభం.. ట్రైలర్‌ ఇలా ఉందేమిటి?

ప్రముఖ నటి సమంత సొంత బ్యానర్‌ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’లో తీసిన తొలి సినిమా ‘శుభం’ మే 9 న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శుభం ట్రైలర్‌ ఈరోజు విడుదల చేశారు. 

‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ కంటెంట్ విషయానికి వస్తే, ఓ ఊర్లో ముగ్గురు స్నేహితులు.. వారిలో ఇద్దరికీ పురుషాహంకారం ఉంటుంది. స్త్రీలను గౌరవించాలనే మూడోవాడికి  పెళ్ళి అవుతుంది. కానీ ఫస్ట్ నైట్‌లోనే అతనికి భార్య గురించి భయంకరమైన నిజం తెలుస్తుంది. 

టీవీలో సీరియల్స్ చూస్తున్నప్పుడు ఆమెను ఎవరైనా అడ్డుకుంటే దెయ్యం పట్టినట్లు వ్యవహరిస్తుంది. ఎత్తి అవతల పడేస్తుంది. ఈ విషయం ఊరందరికీ తెలుస్తుంది. భార్యని ఓ భూతవైద్యురాలు (సమంత) దగ్గరకు తీసుకువెళ్ళిన్నట్లు ట్రైలర్‌లో చూపారు. ట్రైలర్‌ చూస్తే ఇది కామెడీ హర్రర్ సినిమా అనిపిస్తుంది.        

ఈ సినిమాలో నూతన నటీనటులు గవిరెడ్డి శ్రీనివాస్, మల్గిరెడ్డి, చరణ్‌ పేరి, షాలిని కొండెపూడి, శ్రీయ కొంఠం తదితరులు ముఖ్య పాత్రలు చేయగా సమంత అతిధి పాత్రలో నటించారు. 

ఈ సినిమాకు కధ: వసంత్ మరిగంటి, నేపద్య సంగీతం: వివేక్ సాగర్, పాటలు: రహమాన్, పాటలకు సంగీతం: షోర్ పోలీస్, కెమెరా: మృధుల్ సుజీత్ సేన్‌, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు.