నాగ చైతన్య-కార్తీక్‌ దండు తవ్వకం షురూ

విరూపాక్ష దర్శకుడు కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఎన్‌సీ 24 వర్కింగ్ టైటిల్‌తో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ మొదలైందని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

కాలంలో మరుగున పడిన రహస్యాలని కనుగొనేందుకు తవ్వకం మొదలు అంటూ పోస్ట్ చేసిన ఆ వీడియో క్లిప్‌లో ప్రీ-ప్రొడక్షన్ పనులను చూపిస్తూనే, నాగ చైతన్య ఓ కాగడా పట్టుకొని చీకటి గుహలోకి ప్రవేశించి, గుహలో ఓ గోడపై వ్రాసున్న ‘ఎక్స్‌కావేషన్ బిగిన్స్’ (తవ్వకం ప్రారంభం) అని చూపడం బాగుంది. 

ఈ సోషియో ఫ్యాంటసీ, అడ్వంచర్ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా శ్రీలీల లేదా మీనాక్షి చౌదరి నటించబోతున్నారు. ఈ సినిమాకి ‘వృష ఖర్మ’ అని టైటిల్‌ ఖరారు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ఖరారు చేయవలసి ఉంది. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు.