
తెలుగు సినీ పరిశ్రమకు గతంలో ఇచ్చే నంది అవార్డుల స్థానంలో ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం ప్రముఖ నటి జయసుధ జ్యూరీ చైర్ పర్సన్‌గా 15 మంది నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు అధ్యక్షతన బుధవారం ఈ కమిటీ తొలి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “దాదాపు 14 ఏళ్ళ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులకు సినీ పరిశ్రమ నుంచి విశేష స్పందన వచ్చింది. అన్ని కేటగిరీలలో కలిపి మొత్తం 1248 నామినేషన్స్ అందడం చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు.
జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ మాట్లాడుతూ, “ప్రభుత్వం మాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు ముందుగా సిఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారికి ధన్యవాదాలు. ఈ బాధ్యతని సవాలుగా తీసుకొని అత్యుత్తమ సినిమాలు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలని ఎంపిక చేస్తాము,” అని చెప్పారు.
ఉగాది రోజున ఈ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ విధివిధానాల రూప కల్పన, కమిటీ ఏర్పాటు, నామినేషన్స్ స్వీకరణ ప్రక్రియలో ఆలస్యం అయ్యింది. జ్యూరీ సభ్యులు స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తిచేస్తే వెంటనే అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని దిల్‌రాజు చెప్పారు.