అందుకే అదుర్స్-2 చేయలేదు: జూ.ఎన్టీఆర్‌

జూ.ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌, సంగీత శోభన్, విష్ణు ప్రధాన పాత్రలలో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ విజయం సాధించడంతో శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సినిమా సక్సస్ ఈవెంట్‌ జరిగింది. ఈ వేడుకలో జూ.ఎన్టీఆర్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, “అందరినీ నవ్వించి కొంత సేపైన బాధలు మరిచిపోయేలా చేయడం చాలా గొప్ప విషయం. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సినిమాతో అందరినీ నవ్వించి అలరించాడు. నార్నే నితిన్‌, సంగీత శోభన్, విష్ణు ముగ్గురు కూడా అద్భుతంగా నటించారు. అందరినీ నవ్వించారు. నిజానికి కామెడీ చేయడం చాలా కష్టం. అందుకే నేను అదుర్స్-2 చేయట్లేదు,” అని చెప్పారు. 

తనకు పెళ్ళయిన కొత్తలో నార్నే నితిన్‌ చిన్న వయసు కనుక నాతో మాట్లాడేందుకు భయపడి పారిపోయి రూములో దాక్కొనేవాడు. కానీ క్రమంగా మా మద్య పరిచయం పెరిగిన దగ్గరైన తర్వాత ఓ రోజు నేను కూడా సినిమాలలో నటించాలనుకుంటున్నానని చెప్పాడు. నేను మరో క్షణం ఆలోచించకుండా నా సపోర్ట్ ఉండదని నీ అంతటా నువ్వే ఎదగాలని చెప్పేశాను. 

ఆ తర్వాత మళ్ళీ మేము ఎన్నడూ సినిమాల గురించి మాట్లాడింది లేదు. ఇప్పుడు ఈ సినిమాతో నితిన్‌ తనని తాను నిరూపించుకొని మన ముందు ఉన్నాడు. ఎవరి సహాయ సహకారాలు లేకుండా నితిన్‌ ఈ స్థాయికి ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మున్ముందు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను,” అని జూ.ఎన్టీఆర్‌ అన్నారు.