పుష్ప-2 రిలీజ్‌కి ముందే ఇన్ని రికార్డులా!

అల్లు అర్జున్‌, రష్మిక జంటగా డిసెంబర్‌ 5వ తేదీన విడుదల కాబోతున్న పుష్ప-2 వరుసపెట్టి రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ ఫంక్షన్‌లో బిహార్‌ రాజధాని పాట్నాలో నిర్వహిస్తే, అదేదో ఎన్నికల సభకి జనసమీకరణ చేసి తీసుకువచ్చిన్నట్లు లక్షకు పైగా అభిమానులు వచ్చారు. అది చూసి బాలీవుడ్‌ పెద్దలు సైతం ఆశ్చర్యపోయి ఉంటారు. 

మొన్న అంటే నవంబర్‌ 17న ట్రైలర్‌ రిలీజ్ కాగా అప్పుడే 120 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో ట్రైలర్‌ చూసేందుకు ఏమీ చెల్లించక్కరలేదు గాబట్టి అన్ని వ్యూస్ వచ్చాయనుకోవచ్చు. కానీ విదేశాలలో ప్రీ-రిలీజ్ బుకింగ్స్ అప్పుడే మిలియన్ డాలర్లు రాబట్టి అమెరికా బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యంత వేగంగా ప్రీ-సేల్ బుకింగ్స్ సాధించిన సినిమాగా పుష్ప-2 నిలిచింది. 

విదేశాలలో డిసెంబర్‌ 4వ తేదీనే విడుదల కాబోతోంది. కనుక జోరుగా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. 

పుష్ప-2 ట్రైలర్, దానిలో తమ హీరో అల్లు అర్జున్‌ జోరు చూసిన అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు. పుష్ప-2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.