ప్రముఖ కోలీవుడ్ నటుడు ఢిల్లీ గణేశ్ (80) ఇక లేరు. ఆదివారం ఉదయం చెన్నైలోని రామాపురంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఆయన మొదట భారత్ వాయుసేనలో పనిచేశారు. 1977లో ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో కోలీవుడ్‌లో నటుడుగా ప్రవేశించారు. అప్పటి నుంచి తమిళ్, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో సుమారు 400కి పైగా సినిమాలలో విలన్, కమెడియన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు.
వాటిలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన అపూర్వ సహోదరులు సినిమాలో విలన్‌గా నటించారు. మైఖేల్ మదనకామరాజు, సింధు భైరవి, నాయగన్ తదితర సినిమాలు ఆయనకు మంచి నటుడుగా గుర్తింపునిచ్చాయి.
కోలీవుడ్ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్ళి ఢిల్లీ గణేశ్ భౌతిక కాయానికి నివాళులు ఆర్పిస్తున్నారు. సోమవారం ఉదయం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.