
వరుణ్ తేజ్ హీరోగా చేసిన మట్కా సినిమా ఈనెల 14న విడుదల కాబోతోంది. కనుక సినీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “నేను సినీ కుటుంబంలో పుట్టి సినీ వాతావరణంలో పెరిగాను కనుక సినీ రంగంలోనే ఏదైనా చేయాలని అనుకున్నాను. మొదట దర్శకుడు అవ్వాలనుకున్నానని చెపితే మా నాన్నగారు పూరీ జగన్నాధ్ వద్దకు పంపించారు. ఆయనతో కొంతసేపు మాట్లాడిన తర్వాత దర్శకత్వం మామూలు విషయం కాదని అర్దమైంది.
ఆ తర్వాత హీరోగా ప్రయత్నించి మెల్లగా నిలదొక్కుకున్నాను. కానీ ఎప్పటికైనా ఓ సినిమాకి దర్శకత్వం చేయాలనే కోరిక నాలో అలాగే ఉంది. భవిష్యత్‌లో ఎప్పుడైనా అవకాశం లభిస్తే చేస్తాను,” అని అన్నారు.
ప్రేమ, పెళ్ళి గురించి మాట్లాడుతూ, “ఒకప్పుడు స్నేహితులే జీవితం అనుకున్నాను. కానీ స్నేహితులు కూడా ఒకరొకరు దూరం అవుతుంటారని, భార్య మాత్రమే జీవితాంతం తోడుగా ఉంటుందని గ్రహించడానికి చాలా సమయం పట్టింది.
ఆ తర్వాత కూడా సరైన జీవిత భాగస్వామి దొరకకపోతే జీవితం నరకం అవుతుందని కూడా గ్రహించాను. అందువల్లే లావణ్యతో ఏడేళ్ళు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత మేమిద్దరం జీవితాంతం కలిసి ఉండగలమనే నమ్మకం ఏర్పడిన తర్వాత పెళ్ళి చేసుకున్నాము,” అని వరుణ్ తేజ్ చెప్పారు.
కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా చేసిన మట్కా ఈ నెల 14న 5 భాషల్లో విడుదల కాబోతోంది.