తండేల్ రిలీజ్ డేట్: ఫిబ్రవరి 7

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చేస్తున్న తండేల్ సినిమాకి రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాని మొదటి డిసెంబర్‌ 20న విడుదల చేయాలనుకున్నామని, కానీ కుదరకపోవడంతో ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.

నేడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “డిసెంబర్‌లో కుదరకపోతే జనవరిలో సంక్రాంతికి విడుదల చేయవచ్చు కదా? అని మీరు అడగడం బాగానే ఉంది. కానీ సంక్రాంతి సీజన్‌లో సినిమా విడుదల చేయాలంటే దానికీ ఓ లెక్క, పద్దతి ఉంటుంది. పైగా మేమెన్నడూ సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పలేదు కూడా. ఫిబ్రవరి 7న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాము. ఎటువంటి ఇబ్బంది లేదు,” అని చెప్పారు. 

ఓ యధార్ధ గాధ, ఘటనల ఆధారంగా చందూ మొండేటి ఈ సినిమాని తీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్ళినప్పుడు, గుజరాత్‌ తీరంలో పాకిస్థానీ కోస్ట్ గార్డ్ చేతుల్లో చిక్కుకొంటారు. మత్స్యకారుడుగా నటిస్తున్న నాగ చైతన్య పాకిస్తాన్ జైల్లో చిక్కుకుంటాడు. అతని కోసం సముద్ర తీరం వద్ద హీరోయిన్‌ సాయి పల్లవి ఎదురుచూపులు చూస్తుంటుంది. క్లుప్తంగా ఇదీ తండేల్ కధ.  

ఈ సినిమాకి దర్శకత్వం: చందూ మొండేటి, కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. తండెల్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి నిర్మిస్తున్నారు.