గేమ్ ఛేంజర్‌ టీజర్‌ లాంచింగ్ లక్నోలో.....

రామ్ చరణ్‌-శంకర్ కాంబినేషన్‌లో జనవరి 10వ తేదీన విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్‌ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తునందున, టీజర్‌ని ఉత్తరాది రాష్ట్రాలకు గుండెకాయవంటి ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో విడుదల చేయబోతున్నట్లు శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యమైనందుకు, సినిమా వాయిదా పడినందుకు రామ్ చరణ్‌ అభిమానులు చాలా అసహనంగా ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం రెండు పాటలే విడుదల చేయడం కూడా వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్‌ ముందుగా గేమ్ ఛేంజర్‌ మొదలు పెట్టారు. ఆ తర్వాత జూ.ఎన్టీఆర్‌ దేవర మొదలుపెట్టి పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 27న సినిమా విడుదలయ్యి త్వరలో ఓటీటీలోకి కూడా వచ్చేస్తోంది. కానీ రామ్ చరణ్‌-శంకర్ మొదలుపెట్టిన గేమ్ ఛేంజర్‌ మాత్రం ఇంకా పూర్తికాలేదు.

పైగా శంకర్-కమల్ హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు2 ఫ్లాప్ అవడంతో, రామ్ చరణ్‌ అభిమానులు గేమ్ ఛేంజర్‌ గురించి ఆందోళన చెందుతున్నారు. 

ఈ విషయాలన్నీ నిర్మాత దిల్‌రాజుకి బాగా తెలుసు. అందుకే ఈ నెల నుంచి జనవరి 10న థియేటర్లలో సినిమా విడుదలయ్యే వరకు తరచూ ఏదో ఓ అప్‌డేట్‌ ఇస్తూ, వరుసగా పాటలు రిలీజ్ చేస్తూ, ప్రమోషన్స్ వేగం పెంచాలని నిర్ణయించారు.

గేమ్ ఛేంజర్‌ పాన్ ఇండియా మూవీ కనుక ఉత్తరాది రాష్ట్రాలలో కూడా జోరుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే నవంబర్‌ 9వ తేదీన లక్నోలో గేమ్ ఛేంజర్‌ టీజర్‌ విడుదల చేయబోతున్నారు.