
పుష్ప-2 సినిమాలో రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయిపోయిందని, నవంబర్ నెలాఖరులోగా ఆ రెండు పాటలు కూడా పూర్తిచేయబోతున్నట్లు పుష్ప-2 టీమ్ ఇదివరకే ప్రకటించింది.
ఈ సినిమాలో మొదటి నుంచి రష్మిక మందన హీరోయిన్గా ఉంది కనుక ఆమెతో అల్లు అర్జున్ డ్యూయెట్ సాంగ్ పూర్తి చేసేందుకు ఎటువంటి ఇబ్బందీ లేదు. కానీ పుష్ప మొదటి భాగంలో ‘ఊ అంటావా మావా... ఉహూ అంటావా...” ఐటెమ్ సాంగ్, దానిలో సమంత డ్యాన్స్ సినిమాకే హైలైట్గా నిలిచినందున పుష్ప-2లో ఐటెమ్ సాంగ్ అంతకు మించి ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
కనుక ఈ ఐటెమ్ సాంగ్ కోసం దర్శక నిర్మాతలు జాన్వీ కపూర్, శ్రద్దా కపూర్ ఇంకా పలువురి పేర్లు వినిపించాయి. చివరికి శ్రద్ధా కపూర్ అనుకున్నప్పటికీ పారితోషికం, డేట్స్ విషయంలో కుదరకపోవడంతో శ్రీలీలని ఖరారు చేశారు. వచ్చే వారంలోనే అల్లు అర్జున్, శ్రీలీల బృందం మీద ఈ ఐటెమ్ సాంగ్ చిత్రీకరించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపి, జగపతిబాబు పుష్ప-2లో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప-2 డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది.