
ప్రకాష్ రాజ్ బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీ తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అలాగే సమాజానికి సంబందించిన పలు అంశాలపై నిర్భయంగా తన అభిప్రాయాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు. ‘యధార్ధ వాది లోక విరోధి’ అనే నానుడి ప్రకారం ఆయన చెప్పేవి వాస్తవాలే అయినా వాటిని జీర్ణించుకోలేని వారు ఆయనపై విరుచుకు పడుతూనే ఉంటారు. అయితే తన జీవితంలో అత్యంత దుఃఖం కలిగించినవి తన కుమారుడు సిద్ధు (5), తన స్నేహితురాలు గౌరీ లంకేష్ మరణమని వాటి కంటే తనను ఏవీ బాధించలేవని ప్రకాష్ రాజ్ అన్నారు.
కుటుంబం కోసం తాను జీవితంలో ఈ రెండు అతి పెద్ద దుఃఖాలను ఓర్చుకొని, భరించి మళ్ళీ ముందుకు సాగుతున్నానని ప్రకాష్ రాజ్ అన్నారు.
కొన్ని చేదు నిజాలను ప్రజల తరపున నిర్భయంగా చెపుతుంటానని, అందుకు ఎవరికో కోపం వచ్చి తనకు సినిమాలలో అవకాశాలు రాకపోతే అందుకు తాను బాధపడనని ప్రకాష్ రాజ్ అన్నారు. అప్పుడు కూడా తాను ఇదేవిదంగా ప్రశ్నిస్తుంటానని అన్నారు.
సినీ పరిశ్రమలో బాల చందర్, ఇళయరాజా, మణిరత్నం, కృష్ణ వంశీ వంటి వారికి వారి ప్రతిభ వల్లనే అవకాశాలు లభించిన్నట్లే తనకు కూడా తన ప్రతిభ వలననే అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ప్రేక్షకులు తనని ఆదరించినంత కాలం ఎవరూ తనని అడ్డుకోలేరని ప్రకాష్ రాజ్ అన్నారు.