ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తన స్నేహితుడికి సాయం చేయబోయి కోర్టు కేసులో చిక్కున్నారు. ఏపీలో పోలింగ్‌కి ముందు అల్లు అర్జున్ తన భార్య స్నేహరెడ్డిని వెంటబెట్టుకొని నంద్యాల నుంచి వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్నతన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి మద్దతు తెలిపేందుకు వెళ్ళారు. అదే ఇప్పుడు కేసు రూపంలో అల్లు అర్జున్‌ని వెంటాడుతోంది.
ఆ రోజు అల్లు అర్జున్ దంపతులు నంద్యాల శివారు చేరుకోగానే అక్కడి నుంచి వైసీపి కార్యకర్తలు, అభిమానులు భారీ ఊరేగింపుగా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్ళారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
కనుక అనుమతి లేని అటువంటి ఊరేగింపులపై నిషేదం అమలులో ఉంది. ఆ నిషేధాజ్ఞలు ఉల్లంగించి నంద్యాలలో భారీ ఊరేగింపు నిర్వహించినందుకు అల్లు అర్జున్, రవిచంద్ర కిషోర్ రెడ్డి కేసు నమోదైంది.
సోమవారం ఆ కేసు విచారణ జరగాల్సి ఉంది కానీ ఆలస్యం అవడంతో నేటికీ వాయిదా పడింది.
ఈ కేసులో వారిరివురూ కౌంటర్లు దాఖలు చేశారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న తన స్నేహితుడిని అభినందించేందుకు తాను వచ్చానని, తన అభిమానులు తమని తోడ్కొని ఇంటికి తీసుకువచ్చారు తప్ప పట్టణంలో ఎక్కడ ఎటువంటి తప్ప ఎటువంటి బహిరంగ సభలు నిర్వహించలేదని అల్లు అర్జున్ కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. స్నేహితుడిని సందర్శించడానికి వస్తే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదు కనుక ఈ కేసు కొట్టివేయాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారు. బహుశః వారిరువురినీ కోర్టు మందలించి విడిచిపెట్టేయవచ్చు.
కానీ ఆ రోజు అల్లు అర్జున్ జనసేన, టిడిపిలను కాదని వాటిని శత్రువుగా భావిస్తున్న వైసీపికి మద్దతు తెలిపినందుకు నేటికీ ఆ రెండు పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఓ సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై గుర్రుగానే ఉన్నారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 డిసెంబర్ 6న విడుదల కాబోతోంది. ఆలోగా ఈ గొడవలు చల్లారిపోతాయని ఆశిద్దాం.