సంక్రాంతి బరిలో విజయ్‌ దేవరకొండ కూడా

వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు చాలా సినిమాలే విడుదల కాబోతున్నాయి. వాటిలో మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘గుంటూరు కారం’, నాగార్జున-విజయ్‌ బిన్నిల ‘నా సామి రంగా’, తేజా సజ్జా-ప్రశాంత్ వర్మల ‘హనుమాన్’, రవితేజ-కార్తీక్ ఘట్టమనేనిల ‘ఈగిల్’ సినిమాలు ఉన్నాయి. తాజాగా విజయ్‌ దేవరకొండ కూడా సంక్రాంతి బరిలో దిగబోతున్నాడు.

గీతా గోవిందం వంటి సూపర్ హిట్ అందిందించిన పరశురామ్ పేట్ల దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా విడి-13 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోందని, ఇప్పటికే 50 శాతం పైగా పూర్తయిందని కనుక నవంబర్‌ నెలాఖరులోగా షూటింగ్ పూర్తిచేసుకొని జనవరిలో సంక్రాంతి పండుగ సినిమాను విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

ఈ సినిమాలో  విజయ్‌ దేవరకొండకు జోడీగా మృణాల్ ఠాకూర్‌ నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్-లుక్ పోస్టర్‌ విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఒకేసారి ఇన్ని సినిమాలు జనవరిలో సంక్రాంతికి విడుదలవుతున్నందున ఈసారి సినీ ప్రియులకు ఇవీ ఓ పెద్ద పండగే కదా?