ఉస్తాద్ షూటింగ్‌ ఆగిపోలేదు... చేస్తూనే ఉన్నాం: హరీష్

ఏపీలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడంతో పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్ భగత్ సింగ్‌  సినిమా షూటింగ్‌ మద్యలో రాజమండ్రి వెళ్ళారు. అక్కడ సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుని ఇవాళ్ళ పరామర్శించబోతున్నారు. ఈ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా షూటింగ్‌ నిలిచిపోయిందని అభిమానులు ఆందోళన చెందుతుండటంతో దర్శకుడు హరీష్ శంకర్‌, షూటింగ్‌ నిలిచిపోలేదని బుధవారం పవన్‌ కళ్యాణ్‌తో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించామని తెలియజేస్తూ ట్విట్టర్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. 

వాటిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ డ్రెస్సులో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలను, ఆయనకు సన్నివేశం వివారిస్తున్న ఫోటోను పెట్టారు. పవన్‌ కళ్యాణ్‌ వచ్చినప్పుడు ఆయనపై, లేనప్పుడు మిగిలిన నటీనటులతో సన్నివేశాలను ఎక్కడా ఆగకుండా పూర్తిచేస్తున్నామని హరీష్ శంకర్‌ తెలియజేశారు. కనుక పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు సినిమా ఆలస్యం అవుతుందని ఆందోళన చెందనవసరం లేదని హరీష్ శంకర్‌ స్పష్టం చేశారు. 

అయితే ఏపీ మంత్రి రోజా తమ ప్రభుత్వం త్వరలో నారా లోకేష్‌తో సహా టిడిపిలో ఇంకా చాలామంది ముఖ్యనేతలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని బహిరంగంగా చెపుతున్నందున, ఈ కష్టకాలంలో పవన్‌ కళ్యాణ్‌ టిడిపికి అండగా నిలబడేందుకు మరికొన్ని రోజులు ఏపీలో ఉండవలసిరావచ్చు. కనుక ఉస్తాద్ భగత్ సింగ్‌ షూటింగ్‌లో పాల్గొనలేకపోవచ్చు.