
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలో వారాహి యాత్రలు ముగించుకొని మూడు నెలల తర్వాత మళ్ళీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కానీ ఏపీలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి, జైలుకు పంపడంతో పవన్ కళ్యాణ్ ఆయనకు సంఘీభావం తెలిపేందుకు మళ్ళీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని విజయవాడ వెళ్ళిపోయారు.
అయితే ఈ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ పొంది బయటకు వచ్చినా, ఏపీ ప్రభుత్వం ఆయనపై మరో కేసు వేసి అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి పంపేందుకు సిద్దంగా ఉంది. కనుక ఇప్పుడు ఏపీలో రాజకీయాలు చాలా వేడివేడిగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ వాటిని వదిలి సినిమా షూటింగ్ కోసం తిరిగిరాలేక పోవచ్చు.
కనుక అంతవరకు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు నిలిచిపోక తప్పదు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం పవన్ కళ్యాణ్ లేనిసమయంలో మిగిలిన నటీనటులతో సన్నివేశాల షూటింగ్ పూర్తిచేస్తున్నారు. కానీ క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు మాత్రం పూర్తిగా నిలిచిపోయిన్నట్లే. మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.