
పుష్ప-2 సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారిని సంతోషాపరుస్తూ కొద్ది సేపటి క్రితం మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించింది. అయితే అది చూసి అభిమానులు తీవ్ర నిరాశ చెందడం ఖాయం. వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తామంటూ ప్రకటించింది. అంటే దాదాపు ఏడాది తర్వాత అన్నమాట. ఈ సినిమా మొదలుపెట్టి ఏడాదిపైనే అయ్యింది. కనుక ఈ ఏడాది డిసెంబర్ లేదా 2024 జనవరికి రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తుంటే 2024, ఆగస్ట్ 15న విడుదల చేస్తామని ప్రకటించడం చాలా నిరాశ కలిగించేదే. ఈ లెక్కన చూస్తే ఇంతవరకు పుష్ప-2 సగం కూడా పూర్తికాలేదని అర్దమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఏడాదికో సినిమా చేసేస్తుంటే, అల్లు అర్జున్ ఒకే సినిమా పట్టుకొని తాపీగా రెండేళ్ళు కాలక్షేపం చేసేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2లో అల్లు అర్జున్‌కు జంటగా మళ్ళీ రష్మిక మందన జంటగా నటిస్తోంది. ఈ సినిమాలో కూడా ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా చేరారు. ఆయన ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు.
పుష్ప-2ని కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.