
ప్రభాస్ తాజా సినిమా సలార్ ఈ నెల 28న విడుదల కాబోతుండటంతో ముందుగా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి చాలా టికెట్స్ అమ్మేశారు. కానీ ఏ కారణం చెప్పకుండా అడ్వాన్స్ బుకింగ్స్ రద్దు చేసి టికెట్ డబ్బు వాపసు చేస్తుండటంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక కారణాల వలన సలార్ సినిమా ఈ నెల 28న విడుదలకాదని కొన్ని రోజుల క్రితమే డిస్ట్రిబ్యూటర్లకు సందేశాలు పంపిన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రేక్షకులకు టికెట్ డబ్బు వాపసు చేస్తుండటంతో ఆ వార్తలు నిజమేనని స్పష్టమైంది.
ఇదే విషయం తెలియజేస్తూ ఓ అభిమాని రద్దుచేయబడిన సలార్ టికెట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “చిత్రనిర్మాణ సంస్థ హోంబోలే సినిమా గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఇవాళ్ళ నాకు టికెట్ డబ్బు వాపసు రావడం చూసి నేను చాలా నిరాశ చెందాను. అభిమానులుగా మేమందరం కోరుకొనేది ఒక్కటే ఈ సినిమాని మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెపితే చాలు,” అని ట్వీట్ చేశారు.
సలార్ వాయిదా పడబోతోందని సమాచారం అందరికీ తెలిసిపోయింది కానీ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే విషయం చిత్రనిర్మాణ సంస్థ చెప్పకుండా మౌనం వహిస్తుండటమే అభిమానులకు ఎక్కువ ఆగ్రహం తెప్పిస్తోంది. ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అభిమానులు అందరూ సలార్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ హోంబోలే సంస్థ వారి సహనాన్ని పరీక్షిస్తున్నట్లుంది.