విజయ్ దేవరకొండా... మాకు నష్టపరిహారం ఇవ్వగలవా?

ఇటీవల విశాఖలో జరిగిన ఖుషీ సినిమా సక్సస్‌ మీట్‌లో విజయ్ దేవరకొండ తన అభిమానులలో 100 మందికి ఒక్కొక్కరికీ లక్ష చొప్పున కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ చేసిన ఈ ప్రకటన అటు అభిమాన సంఘాలలో, ఇటు సినీ పరిశ్రమలో మారుమ్రోగిపోతోంది. 

దీనిపై స్పందించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేసింది. “డియర్ విజయ్ దేవరకొండ, వరల్డ్ ఫమస్ లవర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ వలన మేము రూ.8 కోట్లు నష్టపోయాము. కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు. మీరు మీ అభిమానులకు కోటి రూపాయలు ఆర్ధికసాయం చేస్థానని చెప్పి మీ విశాల హృదయం చాటుకొంటున్నారు. అదేవిదంగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ కుటుంబాలను కూడా దయచేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అభిషేక్ పిక్చర్స్ ట్వీట్‌ చేసింది.     

సాధారణంగా పెద్ద హీరోలు సినిమాలలో నటించేందుకు చాలా భారీ మొత్తంలో పారితోషికాలు తీసుకొంటారు. కనుక సినిమా ఫ్లాప్ అయినప్పుడు వారు ఎంతోకొంత తిరిగి ఇచ్చేస్తుంటారు. కనుక వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వలన కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలని అభిషేక్ పిక్చర్స్ ట్వీట్‌ చేయడం సహజమే. మరి విజయ్ దేవరకొండ వారికి ఏమైనా ఇస్తారో లేదో?