సాధారణంగా అభిమానులు తమ హీరోల కోసం చందాలు వేసుకొని థియేటర్ల వద్ద కటవుట్లు పెడుతుంటారు. సినిమా రిలీజ్‌కు ముందు హిట్ అయితే ఆ తర్వాత హడావుడి చేస్తుంటారు. కేవలం తమ హీరోల మీద అభిమానంతో జేబులో నుంచి డబ్బు తీసి ఖర్చుపెడుతుంటారు. అందుకు ప్రతిగా హీరోలు వారికి తిరిగి ఏమీ ఇవ్వరు పొగడ్తలు తప్ప.
కానీ మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం తన అభిమానులకు కోటి రూపాయలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున మొత్తం వంద మంది అభిమానులకు కోటి రూపాయలు పంచబోతున్నానని విశాఖలో జరిగిన ఖుషీ సక్సస్ సక్సస్ మీట్‌లో విజయ్ దేవరకొండ ప్రకటించాడు.
అయితే దీనిని ఏవిదంగా అమలుచేయాలో ఇంకా ఆలోచిస్తున్నానని, కానీ వారం పది రోజుల్లో అభిమానులను ఎంపిక చేసి వారికి స్వయంగా లక్ష రూపాయల చెక్కులను తానే అందజేస్తానని విజయ్ దేవరకొండ చెప్పాడు. ఇంతవరకు తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరో ఇలా అభిమానులకు డబ్బులు పంచలేదు. ఈ కొత్త ట్రెండ్ విజయ్ దేవరకొండ ప్రారంభిచడంతో అటు సినీ పరిశ్రమలో ఇటు అభిమాన సంఘాలలో దీనిపై చర్చ మొదలైంది.
ఈ వేడుకలోనే విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు కూడా సినీ పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. “వ్యక్తిగతంగా నా మీద, నా ఈ సినిమా మీద సోషల్ మీడియాలో కొందరు దాడులు చేస్తున్నారు. కొందరు డబ్బులిచ్చి మరీ నా ఈ సినిమా బాగోలేదని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.
సెప్టెంబర్ 1న ఖుషీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో ఫేక్ రేటింగ్స్, ఫేక్ రివ్యూలు వచ్చాయి. వాటన్నిటినీ తట్టుకొని ‘ఖుషీ’ సినిమా విజయవంతం అయ్యిందంటే అది మీ అందరి అభిమానం వల్లనే. అందుకే ఈ సినిమా ద్వారా నేను సంపాదించుకొన్న డబ్బులో కొంత మీతో పంచుకోవాలనుకొంటున్నాను. లేకుంటే వేస్ట్ అనిపిస్తుంది. నా అభిమానులకు ఈ కోటి రూపాయల పంపిణీకి సంబందించి దరఖాస్తుఫారంలను మంగళవారం సోషల్ మీడియాలో పెడతాము,” అని విజయ్ దేవరకొండ చెప్పారు.