నేటి నుంచి మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్‌ షూటింగ్‌ షురూ

హరీష్ శంకర్‌-పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ ‘గబ్బర్ సింగ్‌’ సినిమా నేటికీ అభిమానుల కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుత్తున ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

కానీ పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల ఓ నెలరోజుల పాటు ఏపీలో రాజకీయ పర్యటనలు చేయడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. పవన్‌ కళ్యాణ్‌ తన రాజకీయ యాత్రలు ముగించుకొని మళ్ళీ షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో నేటి నుంచి హైదరాబాద్‌ ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. 

దాంతో పాటు ఈ సినిమా షూటింగ్‌ కోసం సిద్దం చేసిన కత్తులు, గొడ్డళ్ళు వగైరా ఆయుధాలను దర్శకుడు హరీష్ శంకర్‌ ప్రదర్శిస్తున్న ఫోటోను కూడా పెట్టారు. ఈ షూటింగ్‌ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి హైదరాబాద్‌లో ఓ అద్భుతమైన సెట్ సిద్దం చేశారు. మళ్ళీ ఇన్ని రోజుల విరామం తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్‌ షూటింగ్‌ మొదలవుతుండటంతో అభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు. 

ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌తో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. పంకజ్ త్రిపాఠి, గౌతమి, అశోతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, నాగ మహేష్, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, కౌశిక్ మెహతా తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

నవీన్ ఎర్నేని, వైసీపీ. రవిశంకర్ కలిసి రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ  సినిమాకు దేవిశ్రీ ప్రసాద్: సంగీతం, ఆయనంకా బోస్: సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.