హరిహర వీరమల్లు అప్‌డేట్... 2024లో విడుదల

క్రిష్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాకి సంబందించి నిర్మాత ఏఎం రత్నం నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఓ సినీ కార్యక్రమంలో అప్‌డేట్ ఇచ్చారు. 

విలేఖరులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెపుతూ, “నిజమే హరిహర వీరమల్లు సినిమా మొదలుపెట్టి చాలా కాలమే అయ్యింది. ఇది చాత్రిక నేపధ్యం ఉన్న సినిమా కనుక మామూలు సినిమాల కంటే దీనికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే దీని గ్రాఫిక్ వర్క్స్ పూర్తవడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇవి కాక పవన్‌ కళ్యాణ్‌ గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అందుకే తక్కువ సమయంలో పూర్తిచేయగల సినిమాలను ముందుగా పూర్తిచేస్తున్నారు. 

అయితే ఎట్టి పరిస్థితులలో ఈ డిసెంబర్‌లోగా షూటింగ్‌ పూర్తి చేసి 2024 ఎన్నికలలోగా విడుదల చేస్తాము,” అని చెప్పారు. వచ్చే ఎన్నికలలోగా అంటే 2024 ఫిభ్రవరి, మార్చి నెలల్లోగా అని భావించవచ్చు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు దగ్గరపడుతున్నందున పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ రాజకీయ పర్యటనలు చేయకతప్పదు. కనుక హరిహర వీరమల్లు షూటింగ్‌ పూర్తయ్యేవరకు ఎవరి మాట నమ్మలేని పరిస్థితి కనిపిస్తోంది. 

హరిహర వీరమల్లు 17వ శతాబ్దంలో మొగలుల కాలంలో జరిగిన కధగా తీస్తున్నారు. సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తీస్తున్న ఈ సినిమాను ఏ దయాకర్ రావు మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ: క్రిష్ జాగర్లమూడి, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, కెమెరా: జ్ఞానశేఖర్ విఎస్, సంగీతం: ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్‌ నటులు నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.