
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల విడుదల చేసిన ఆ సినిమా టీజర్లో ఏపీలోని స్టువర్టుపురం గ్రామ ప్రజలను ముఖ్యంగా ఎరుకల సామాజిక వర్గానికి చెందినవారిని కించపరిచేవిదంగా డైలాగ్స్ ఉన్నాయని అభ్యంతరం తెలుపుతూ చుక్కా పాల్ రాజ్ అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఏవీ శేషసాయిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దానిపై బుదవారం విచారణ చేపట్టి, టీజర్‌ను చూసిన తర్వాత పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. సెన్సార్ బోర్డు పరిశీలించకుండా, ఆమోదం తీసుకోకుండా టీజర్‌ని ఎలా విడుదల చేశారని ప్రశ్నించింది.
సినిమాలు తీస్తున్నవారికి సమాజం పట్ల బాధ్యత ఉండదా?అని ప్రశ్నిస్తూ, ఆ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్‌కు నోటీస్ పంపింది. నాలుగు వారాలలో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ముంబైలోని సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్ పర్సన్‌ను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
1970 దశకంలో ఆంధ్రప్రదేశ్‌లో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కధ ఆధారంగా అదే పేరుతో మాస్ మహారాజ రవితేజ ఈ సినిమా చేస్తున్నారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. మండవ సాయి కుమార్, ముఖేష్ చబ్ర, ప్రవీణ్ దాచారం, రేణు దేశాయ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
టైగర్ నాగేశ్వరరావు సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు విడుదల కాబోతోంది.
ఈ సినిమాకి డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, కెమెరా: ఆర్ మాధే, సంగీతం: జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.