అన్నపూర్ణలో గుంటూరు కారం కొత్త షెడ్యూల్ షురూ

త్రివిక్రం శ్రీనివాస్‌, మహేష్ బాబు కాంబినేషన్‌లో సిద్దం అవుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్‌ మంగళవారం హైదరాబాద్‌, అన్నపూర్ణ 7 ఏకర్స్ స్టూడియోలో ప్రారంభమైంది. దీని కోసం ప్రత్యేకంగా రెండు సెట్స్‌ వేశారు. వాటిలో ఈ రెండు రోజులు ప్రకాష్ రాజ్‌, రమ్యకృష్ణ మరికొందరు నటీనటులతో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి మహేష్ బాబు షూటింగ్‌లో జాయిన్ అవుతారు. 

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్‌ ఓ రాజకీయ నాయకుడుగా, మహేష్ బాబు తాతగారిగా నటిస్తున్నారు. అన్నపూర్ణలో వేసిన రెండు సెట్స్‌లో ఒకటి ఆయన ఇంటి సెట్‌లో కాగా, మరొకటి పార్టీ కార్యాలయం సెట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటి సెట్‌లోనే షూటింగ్‌ జరుగుతోంది. మహేష్ బాబు వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయం సెట్‌లో షూటింగ్‌ జరుగుతుందని సమాచారం. 

ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా మీనాక్షీ చౌదరి నటిస్తోంది. శ్రీలీల ఓ ముఖ్య పాత్ర చేస్తోంది. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.