ఈసారి పండక్కి నా సామిరంగా...

కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం నా సామిరంగా ఫస్ట్ గ్లింప్స్‌ నేడు విడుదల చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్‌ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం దర్శకుడు కాగా ప్రసన్నకుమార్ బెజవాడ కధ, డైలాగ్స్ అందిస్తున్నారు. 

ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌లో ఓ డెన్‌లో 50 మంది రౌడీలను సిద్దం చేశామని చెపుతుంటే వారిలో ఒకరొకరు వాడి చెయ్యి తీసేయాలా... కాలు తీసేయాలా... ఏకంగా తల తీసేయాలా...ఎవడన్నా వాడూ” అని అడుగుతుంటే ‘కింగ్’ అని చెప్పగానే వారందరూ భయంతో వణికిపోతూ, చెమటలు కార్చుతారు. అప్పుడు వారి మద్యలోనే కూర్చోన్న కింగ్ నాగార్జున నవ్వుతూ మొహం మీద కప్పుకొన్న రుమాలుని కొద్దికొద్దిగా తొలగిస్తూ ఫస్ట్-లుక్‌ రివీల్ చేస్తారు. ఆ తర్వాత కుమ్ముడే! 

ఫస్ట్ గ్లింప్స్‌లో గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ ప్యాకెట్, గోలీ సోడా వంటివి చూపారు. కనుక ఇది కూడా పీరియాడికల్ మూవీ అని అర్దమవుతోంది. ఫస్ట్ గ్లింప్స్‌ ముగింపులో “ఈసారి పండక్కి నాసామి రంగా...” అంటూ నాగార్జున డైలాగ్‌ సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు చెప్పేశారు. ఈ సినిమాలో నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించవలసి ఉంది.