నితిన్‌ కొత్త సినిమా తమ్ముడు ప్రారంభం

యువ నటుడు నితిన్‌ తన కొత్త సినిమాని ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు తమ్ముడు అని పేరు ఖరారు చేశారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేయగా వంశీ పైడిపల్లి తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.  

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి మొదలుపెద్తామని దిల్‌రాజు చెప్పారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తమ బ్యానర్‌లో తీసిన ఎంసీఏ, వకీల్ సాబ్ వంటి హిట్స్ అందించారని, నితిన్‌తో చేసిన ‘దిల్‌’ సినిమా నేటికీ ఎవ్వర్ గ్రీన్‌గా నిలిచి ఉందని దిల్‌రాజు అన్నారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నితిన్‌తో ఈ సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని దిల్‌రాజు చెప్పారు. 

నితిన్‌ నటించిన మాచర్ల నియోజకవర్గం గత ఏడాది ఆగస్ట్‌లో విడుదలైంది కానీ పెద్దగా ఆడలేదు. దాని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ అనే మరో సినిమా మొదలుపెట్టాడు. దీనిలో నితిన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాను శ్రేష్టా మూవీస్ బ్యానర్‌పై ఎం సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 23న విడుదల కాబోతోంది.