తెలుగు సినీ పరిశ్రమకు 11 జాతీయ అవార్డులు

తెలుగు సినీ పరిశ్రమకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చిన్నట్లే అనిపిస్తోంది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ సాధించగా, ఇప్పుడు ఏకంగా 11 జాతీయ అవార్డులు సాధించింది. మళ్ళీ వాటిలో కూడా 6 అవార్డులను ఆర్ఆర్ఆర్‌ సినిమాయే దక్కించుకొంది. 

ఆర్ఆర్ఆర్‌ సినిమాకు ఉత్తమ ప్రజాధరణ పొందిన సినిమా, ఉత్తమ నేపద్య సంగీతం: ఎంఎం కీరవాణి, ఉత్తమ నేపద్య గాయకుడు కాలభైరవ (కొమురం భీముడో పాటకు), ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (నాటునాటు పాటకు), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ వి.శ్రీనివాస్, ఉత్తమ స్టంట్స్: కింగ్ సల్మాన్‌లకు జాతీయ అవార్డులు లభించాయి. 

ఇక అల్లు అర్జున్‌ తొలిసారిగా ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకొన్నారు. పుష్ప-ది రైజ్ సినిమాలో ఆయన నటనకు ఈ అవార్డు లభించింది. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్‌కు కూడా ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు లభించింది. 

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘ఉప్పెన’ కూడా ఉత్తమ చిత్రంగా జాతీయఅవార్డు అందుకొంది. కొండపొలం సినిమాలో ధమ్ ధమ్ ధమ్ పాటకు గాను చంద్రబోస్‌కు ఉత్తమ పాటల రచయితగా అవార్డు అందుకొన్నారు. ఉత్తమ సినీ విమర్శకుడిగా నల్గొండ జిల్లాకి చెందిన ఎం.పురుషోత్తమాచార్యులకి జాతీయ అవార్డు లభించింది. 

గంగూబాయి కతియావాడి హిందీ చిత్రంలో వేశ్యపాత్ర చేసిన ఆలియా భట్‌కు, మిమి సినిమాలో గర్భవతిగా నటించిన కృతీ సనన్ ఇద్దరూ ఉత్తమ నటీమణులుగా జాతీయ అవార్డులు పొందారు. 

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కధ ఆధారంగా కోలీవుడ్‌ నటుడు మాధవన్ స్వీయ దర్శకత్వంలో తీసిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకొంది. మరాఠీ చిత్రం గోదావరి సినిమాకి దర్శకత్వం చేసిన నిఖిల్ మహాజన్ ఉత్తమ దర్శకుడుగా జాతీయ అవార్డు సాధించారు.   

హిందీ చిత్రం ‘సర్దార్ ఉద్దమ్’కు ప్రాంతీయ ఉత్తమ హిందీ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగాలలో నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 

2021 జనవరి-డిసెంబర్‌ 31లోపుగా సెన్సార్ అయ్యి ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకొన్న సినిమాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులు ప్రకటించామని జాతీయ అవార్డుల జ్యూరీ తెలియజేసింది.