గేమ్ ఛేంజర్‌ సినిమా నుంచి మరో ఫోటో లీక్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్‌, కియరా అద్వానీ జంటగా చేస్తున్న గేమ్ ఛేంజర్‌ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో తెలీని పరిస్థితి. ఈ సినిమాకి సంబందించి అప్‌డేట్ ఇమ్మనమని అభిమానులు అడిగితే, నిర్మాత దిల్‌రాజు దర్శకుడు శంకర్‌నే అడగమని చెప్పడం గమనిస్తే, ఈ సినిమా పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్దం కాదు. 

సినిమా అప్‌డేట్ ఇవ్వకపోయినా అప్పుడప్పుడు లోకేషన్ నుంచి ఫోటోలు మాత్రం లీక్ అవుతూనే ఉన్నాయి. ఇదివరకు రామ్ చరణ్‌ పంచెకట్టులో ఇంటి అరుగుమీద కూర్చొని ఓ కాగితం మీద ఏదో వ్రాస్తున్న ఫోటో ఒకటి, తండ్రిపాత్రలో రామ్ చరణ్‌కు భార్యగా నటించిన అంజలితో దిగిన ఫోటో ఒకటి మీడియాకు లీక్ అయ్యింది. దాంతో పవన్‌ కళ్యాణ్‌ గేమ్ ఛేంజర్‌ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారనే విషయం బయటకు పొక్కిపోయింది. 

తాజాగా ఓ బీచ్‌ ఒడ్డున రామ్ చరణ్‌ నల్లసూటు, తెల్ల ఫ్యాంట్ వేసుకొని నిలబడి ఉండగా తీసిన మరో ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. బహిరంగ ప్రదేశాలలో షూటింగ్‌ చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా ఇలా ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చేస్తుంటాయి. కానీ స్టూడియోలలో సెట్స్‌ వేసి షూటింగ్‌ చేస్తున్నప్పుడు కూడా ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చేస్తుండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఈ సినిమాలో రామ్ చరణ్‌ రిక్షా తొక్కుకొని జీవించే ఓ తండ్రిగా, ఓ ఉన్నతాధికారి(ఐఏఎస్)గా రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్నట్లు లీక్ అయిన ఫోటోలను బట్టి తెలుస్తోంది. తండ్రి పాత్రలో రామ్ చరణ్‌కు జోడీగా అంజలి, కొడుకు పాత్రకు జోడీగా కియరా అద్వానీ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎస్ జే సూర్య, సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్‌ సినిమాను రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ: కార్తీక్ సుబ్బరాజు, కెమెరా తిరు, ఆర్‌ రత్నవేలు, థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి సెలవులలో గేమ్ ఛేంజర్ విడుదలయ్యే అవకాశం ఉంది.