హమ్మయ్యా... ఉస్తాద్ భగత్ సింగ్‌ మళ్ళీ మొదలుపెడుతున్నారట!

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీతో ఏపీ రాజకీయాలలో బిజీ అయిపోవడంతో హరీష్ శంకర్‌ దర్శకత్వంలో మొదలుపెట్టిన  ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా షూటింగ్‌ రెండో షెడ్యూల్ తర్వాత నిలిచిపోయింది. పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు మళ్ళీ షూటింగ్‌కు సిద్దమని తెలియజేయడంతో సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి హైదరాబాద్‌లో షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. దీని కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్స్‌ కూడా సిద్దం చేసిన్నట్లు తెలిపింది. ఈ సెట్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను షూటింగ్‌ చేయబోతున్నామని తెలియజేసింది.

పవన్‌ కళ్యాణ్‌ జనసేనతో తమ మద్యనే తిరుగుతున్నందుకు ఆనందించాలో లేక సినిమాలు చేయలేకపోతున్నందుకు బాధపడాలో అభిమానులకు తెలియడం లేదు. కానీ సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతున్నకొద్దీ దర్శక నిర్మాతలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఖర్చు పెరిగిపోవడంతో పాటు, మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల డేట్స్ మళ్ళీ అడ్జస్ట్ చేయడం చాలా కష్టమవుతుంది.        

పవన్‌ కళ్యాణ్‌, శ్రీలీల జంటగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమాలో పంకజ్ త్రిపాఠి, గౌతమి, అశోతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, నాగ మహేష్, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, కౌశిక్ మెహతా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ. రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.