
మంచు విష్ణు భక్త కన్నప్పగా నటించబోతున్న కన్నప్ప సినిమాకు శుక్రవారం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తం షాట్‌కు మంచు మోహన్ బాబు క్లాప్ కొట్టి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమా కధకు ప్రముఖ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్, తోటపల్లి సాయినాధ్, బుర్రా సాయి మాధవ్ గత రెండేళ్ళుగా మెరుగులు దిద్దారని మంచు విష్ణు చెప్పారు.
ఆదిపురుష్ సినిమాలో జానకిగా నటించిన కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా నటించబోతోంది. స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమైన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకు దర్శకుడుగా వ్యవహరించబోతున్నారు.
ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మించబోతున్నారు.
కన్నప్ప సినిమాకు సంగీతం: మణిశర్మ మరియు స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్ డైరెక్టర్: చిన్న.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో న్యూజిలాండ్‌లో మొదలుపెడతామని తెలియజేశారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించి పూర్తి వివరాలు తెలియజేస్తామని మంచు విష్ణు చెప్పారు.
ఒకప్పుడు ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన మాయాబజార్, నర్తనశాల, లవకుశ, భీష్మ వంటి అనేక పౌరాణిక సినిమాలు నేటికీ ప్రజల హృదయాలలో చెక్కుచెదరకుండా అలాగే నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు అబ్బురపరిచే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత తీసిన ఆదిపురుష్ సినిమాను చూసి యావత్ దేశప్రజలు చాలా బాధపడ్డారు. కనుక ఎవరైనా పౌరాణిక, చారిత్రిక సినిమాలు తీస్తున్నారంటే వాటిని వారు భ్రష్టు పట్టించేస్తారేమోనని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆనాడు కృష్ణంరాజు చేసిన ‘భక్త కన్నప్ప’ సినిమా దానిలో పాటలు నేటికీ తెలుగు ప్రజల గుండెల్లో చెక్కుచెదరకుండాఅలాగే ఉన్నాయని కనుక ప్రేక్షకులు తమ కన్నప్ప సినిమాని దానితో పోల్చి చూసుకొంటారని, ఏమాత్రం తేడా వచ్చినా తిరస్కరిస్తారనే నే విషయం మంచు మోహన్ బాబు, మంచు విష్ణులకు కూడా బాగా తెలిసే ఉంటుంది. కనుక తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వారిని మెప్పించే విదంగా కన్నప్పని తీస్తారని ఆశిద్దాం.