విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ సోదరులిద్దరూ పూర్తి భిన్నమైన మార్గాలలో తమ సినీ ప్రస్థానం సాగిస్తున్నారు. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ స్థాయిలో పడుతూలేస్తూ ప్రయాణిస్తుంటే, ఆనంద్ దేవరకొండ చిన్న సినిమాలతో ఆంధ్రా, తెలంగాణ నేపధ్యంలో చక్కటి చిన్న చిన్న సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకొంటున్నాడు.
మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో మద్యతరగతి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొన్న ఆనంద్ దేవరకొండ, దాని తర్వాత బేబీ సినిమాతో యువతను ఆకట్టుకొని మరో సూపర్ హిట్ కొట్టాడు. చాలా చిన్న బడ్జెట్లో తీసిన బేబీ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా జూలై 14న థియేటర్లలో విడుదలై ఏకంగా రూ.80 కోట్ల కలక్షన్స్ రాబట్టి రికార్డ్ సృష్టించింది.
కనుక ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారిని కూడా మెప్పించేందుకు ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోంది. ఆహా గోల్డ్ సభ్యత్వం కలిగిన సభ్యులు ఒక రోజు ముందుగానే అంటే ఆగస్ట్ 24 సాయంత్రం 6 గంటల నుంచే బేబీని చూడవచ్చని ఆహా సంస్థ తెలియజేసింది.
పదోతరగతి ఫెయిల్ అయ్యి ఆటో నడుపుకొనే హీరో (ఆనంద్ దేవరకొండ), ఎదురింట్లో ఉండే హీరోయిన్ (వైష్ణవి చైతన్య) పాఠశాల స్థాయిలోనే ప్రేమలో మునిగితేలుతారు. ఆ తర్వాత హీరోయిన్ ఇంజనీరింగ్లో చేరినప్పుడు అక్కడ మరో హీరో (విరాజ్ అశ్విన్)తో పరిచయం, ప్రేమగా మారి శారీరిక సంబంధం పెట్టుకోవడం వరకు వెళుతుంది. అప్పుడు హీరో, హీరోయిన్లు మానసికస్థితి, వారు అనుభవించే మానసిక సంఘర్షణని దర్శకుడు సాయి రాజేష్ చాలా అద్భుతంగా చూపాడు.
ప్రస్తుతం సమాజంలో చాలామంది యువతీయువకులకు ఇటువంటి ప్రేమకధలే ఉన్నాయి కనుక వారు బేబీతో బాగా కనెక్ట్ అవడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా వైష్ణవి చైతన్య నటన ఈ సినిమాకు హైలై ట్గా నిలిచింది. ఎంతగా అంటే అబ్బాయిలు అందరూ ఆమెను అసహ్యించుకొనే అంత! కనుక ఈ సినిమాని థియేటర్లలో చూడలేకపోయినవారు ఓటీటీలో తప్పక చూసి తీరాలి.