హైదరాబాద్‌ అన్నపూర్ణాలో గుంటూరు కారం షూటింగ్‌ షురూ

మహేష్ బాబు, త్రివిక్రం శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్‌ నేటి నుంచి హైదరాబాద్‌లో అన్నపూర్ణా స్టూడియోలో మొదలైంది. ఈ సినిమాలో ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి వైరా వెంకటస్వామిగా ప్రకాష్ రాజ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక ఈ సినిమాలో ఆయన, మహేష్ బాబుకి తాతగా కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక ఆయన ఇల్లు, పార్టీ కార్యాలయం రెండు సెట్స్‌లో వేసి దానిలో షూటింగ్‌ చేస్తున్నారు. 

ఈ నెలాఖరు వరకు సాగే ఈ షెడ్యూల్లో రావు రమేష్, ప్రకాష్ రాజ్, మురళీశర్మ, జయరాం, రమ్యకృష్ణ తదితరులు పాల్గొంటున్నారు. మహేష్ బాబు, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, శ్రీలీల కూడా పాల్గొనబోతున్నారు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.