
అల్లు అర్జున్, రష్మిక మందనలు జోడీగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఏడాది కావస్తోంది. కానీ ఇంతవరకు కేవలం 40 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందట. ఈ లెక్కన మరో ఏడాదిపాటు ఈ సినిమా షూటింగ్ సాగేలా ఉందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ మెల్లగా సాగుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు సినిమా గురించి అప్డేట్ ఇవ్వకపోవడం పట్ల వారు సోషల్ మీడియాలో, బయట రోడ్లపైకి వచ్చి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కానీ దర్శకుడు సుకుమార్ గానీ వారిగోడు పట్టించుకోకుండా తాపీగా షూటింగ్ చేసుకొంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీలో ఎర్రచందనం దుంగలను పేర్చి దానికి సంబందించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అడవిలో నుంచి వాటిని పుష్ప గ్యాంగ్ నరికి తీసుకువస్తే, పోలీసులు వాటి కోసం గాలిస్తున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా జనవరిలో సంక్రాంతి పండుగకు వస్తుందని అభిమానులు ఆశపడుతున్నప్పటికీ 2024 ఏప్రిల్లోగా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
పుష్ప-2లో కూడా రావు రమేష్, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో పాటు మరికొంతమంది నటీనటులు కొత్తగా వస్తున్నారు. వారిలో జగపతి బాబు కూడా ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలాయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.