అవన్నీ ఒట్టి పుకార్లే: భోళాశంకర్‌ నిర్మాత అనిల్‌

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చేసిన తాజా చిత్రం భోళాశంకర్‌ ఫ్లాప్ అవడంతో సోషల్ మీడియాలో దానిపై వ్యంగ్యంగా మీమ్స్, పుకార్లు మొదలైపోయాయి. ఈ సినిమాను నిర్మించిన ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధినేత అనిల్‌ సుంకర ఈ సినిమాతో ఆర్ధికంగా దివాళా తీశారని, తన ఆస్తులను కొన్నిటిని తాకట్టు పెట్టారని పుకార్లు వ్యాపించాయి.

ఈ సినిమాలో నటించేందుకు చిరంజీవికి రూ.65 కోట్లు ఇచ్చానని, ఇప్పుడు తన పరిస్థితి తెలిసి ఉన్నా చిరంజీవి తనను ఆదుకోలేదంటూ ఎవరికో మెసేజ్‌ పెట్టారంటూ మరో పుకారు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటిపై అనిల్‌ సుంకర స్పందిస్తూ, “అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే. వాటిలో ఒక్క శాతం కూడా నిజం లేదు. వాటిని ఎవరూ నమ్మవద్దు. వాటిపై ఎటువంటి చర్చలు చేయవద్దు” అని ట్వీట్‌ చేశారు. 

అయితే రజనీకాంత్‌ నటించిన జైలర్, చిరంజీవి నటించిన భోళాశంకర్‌ ఒకేసారి రిలీజ్‌ అయ్యాయి. జైలర్ కలక్షన్స్‌ అద్భుతంగా ఉన్నాయి కానీ దాంతో పోల్చిచూస్తే భోళాశంకర్‌ కలక్షన్స్‌ చాలా తక్కువగా ఉన్నాయి. కనుక భోళాశంకర్‌తో ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తీవ్రంగా నష్టపోయిందనేది వాస్తవం.