శేఖర్ కమ్ముల-ధనుష్ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక

ప్రస్తుతం పుష్ప-2తో సహా ఒకేసారి పలు సినిమాలు చేస్తున్న కన్నడ అందాలభామ రష్మిక మందన శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. ఈ విషయం ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. 

కోలీవుడ్‌ హీరో ధనుష్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తుండటం దానిలో తెలుగువారి అభిమాన నటి రష్మిక మందన హీరోయిన్‌గా తీసుకోవడంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరుగుతాయి. 

ధనుష్కి ఇది 51వ సినిమా కనుక డి51 వర్కింగ్ టైటిల్‌తోనే సినిమా షూటింగ్‌ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే ఈ డి51 సినిమాని ప్రకటిస్తూ చాలా ఆసక్తికరమైన పోస్టర్‌ విడుదల చేశారు. దానిలో ఓ వైపు భారీ భవనాలు, మరోవైపు పేదవారి గుడిసెలు రెంటికీ మద్యలో అడ్డుగోడలా పెద్ద డబ్బుకట్టని చూపించి సినిమాపై ఆసక్తి పెరిగేలా చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై ఏషియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.