త్రివిక్రం శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానులే కాదు... తెలుగు ప్రేక్షకులు అందరూ దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇద్దరూ కలిసి కారం దంచడం మొదలుపెట్టినప్పటి నుంచి ఏవో ఓ అవాంతరాలు రావడం షూటింగ్ నిలిచిపోతుండటం చూసి అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు.
అయితే ఆగస్ట్ 16 నుంచి మళ్ళీ ఏకధాటిగా గుంటూరు కారం దంపుడు మొదలుపెట్టబోతున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ వినోద్ తప్పుకోవడంతో షూటింగ్‌కు బ్రేక్ వచ్చింది. ఆయన స్థానంలో మనోజ్ పరమహంస జాయిన్ అవడంతో షూటింగ్ ప్రారంభించడానికి అంతా సిద్దమైన్నట్లే.
ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో ఇప్పటికే ఓ పెద్ద ఇంటి సెట్ కూడా సిద్దమైంది. దానిలోనే మహేష్ బాబుతో ఉన్న సన్నివేశాలన్నీ పూర్తిచేసేవరకు బ్రేక్ తీసుకోకూడదని త్రివిక్రం శ్రీనివాస్ నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా మిగిలినవారితో సన్నివేశాలను కొన్ని పూర్తిచేసిన తర్వాత మహేష్ బాబు జాయిన్ అవుతాడని సమాచారం.
ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా మీనాక్షీ చౌదరి నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.