భోళాశంకర్‌ బోర్లాపడతాడా ఒడ్డున పడతాడా?

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్ ప్రధానపాత్రలలో తెరకెక్కిన భోళాశంకర్‌ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వేదాళం తమిళ్ సినిమాకు రీమేక్‌గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తీసిన ఈ సినిమాపై ప్రేక్షకులు అప్పుడే పెదవి విరిచేశారు. సినీ విమర్శకులు కూడా భోళాశంకర్‌ 1.75/5 ర్యాంకింగ్ మాత్రమే ఇచ్చారు. 

భోళాశంకర్‌ కమర్షియల్ మూవీ అని ముందే చెప్పినప్పటికీ దీనిలో మళ్ళీ పాత చిరంజీవిని చూపిస్తానంటూ దర్శకుడు మెహర్ రమేష్ ఊదరగొట్టడంతో అభిమానులు హుషారుగా థియేటర్లకు వెళ్ళారు. చెప్పిన్నట్లే చిరంజీవిని ఎలివేట్ చేసి చూపాడు కానీ కధ, కధనం, ఎమ్మోషన్స్ అన్నీ బోర్ కొట్టించేశాయని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. 

వాల్తేర్ వీరయ్యని కష్టపడి ఎలాగో గట్టెకించేసుకొన్నా, భోళాశంకర్‌ మాత్రం బోర్లా పడిన్నట్లే ఉంది. కనుక ఇది మరో ఆచార్య సినిమాల మారకుండా, ఏదోలా గట్టెక్కెస్తే చాలని అభిమానులు కోరుకొంటున్నారు. 

ఈ సినిమా విడుదలకు ముందు చిరంజీవి జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, అప్పుడు ఏపీ మంత్రులు ఆయనపై ఎదురుదాడి చేశారు. కనుక అన్ని పత్రాలు సమర్పించలేదనే వంకతో టికెట్‌ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించలేదు. కనుక సినిమా కలక్షన్స్‌పై ఇదీ చాలా ప్రభావం చూపనుంది. ఈ గొడవ కారణంగా భోళాశంకర్‌ సినిమా ప్రదర్శనలను ఏపీ ప్రభుత్వం అవరోధాలు కల్పిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దానికి ఆ శ్రమ లేకుండా భోళాశంకరే స్వయంగా థియేటర్లలో నుంచి ఓటీటీలోకి వెళ్ళిపోతారేమో?