హాలీవుడ్ స్థాయిలో తెలుగులో యాక్షన్ సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడుగా సుజీత్ మంచిపేరు సంపాదించుకొన్నాడు. ఆయన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమాకు సంబందించి ఓ తాజా అప్డేట్ వచ్చింది.
వచ్చే నెల 2వ తేదీన ఓ అగ్నితుఫాను రాబోతోందని... ఆ హీట్ వేవ్ తట్టుకొనేందుకు అందరూ సిద్దంగా ఉండాలంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు. దానిలో దక్షిణ ముంబైలోని చర్చ్ గేట్ సబర్బన్ రైల్వే స్టేషన్ భవనం వద్ద పవన్ కళ్యాణ్ గ్యాంగ్ మరో గ్యాంగ్‌పై దాడిచేసి కాల్చి చంపేసి వెళ్ళిపోతున్నట్లు చూపారు.
ఈ దాడిని వేరెవరో కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా స్క్రీన్ మీద కొన్ని వివరాలు కనిపిస్తాయి. దానిలో “లొకేషన్ దక్షిణ ముంబైలోని చర్చ్ గేట్, సమయం తెల్లవారుజామున 2.10 గంటలు, వర్షపాతం: 24 మిల్లీ మీటర్లు, రక్తపాతం: 32మిల్లీమీటర్లు, ఉపయోగించిన ఆయుధాలు: డబుల్ బ్యారల్ షాట్ గన్’ అంటూ స్క్రీన్ మీద చూపారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, హరీష్ ఉత్తమన్, కమల్, అర్జున్ దాస్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: వజీద్ బేగ్ అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.