“నాన్నా... పందులే గుంపులుగా వస్తాయి... సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుంది,” అంటూ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులరో అందరికీ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయపార్టీలు కూడా ఈ డైలాగుని అవసరమైనప్పుడల్లా వాడేసుకొంటాయి.
తాజాగా ఆయన చెప్పిన మరో డైలాగ్ అంతకంటే ఘాటుగా ఉంది. ఆయన నటించిన జైలర్ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా ఇటీవల చెన్నైలో జైలర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో రజనీకాంత్ మాట్లాడుతూ, “మొరగని కుక్కా లేదు, విమర్శించని నోరూ లేదు... ఈ రెండూ లేని ఊరూ లేదు,” అంటూ మరో డైలాగ్ చెప్పారు.
అది తనను విమర్శిస్తున్న రాజకీయ నాయకులను, ముఖ్యంగా ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశ్యించే అని అందరూ భావిస్తున్నారు.
కొన్ని నెలల క్రితం ఏపీ టిడిపి అధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొన్నప్పుడు, ఎన్టీఆర్‌తో పాటు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కూడా ఆయన పొగిడారు. ఆ తర్వాత హైదరాబాద్ హైకెట్ సిటీ రోడ్లు న్యూయార్క్‌ను తలపించేలా అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంశించారు.
వైసీపీ బద్ధశత్రువైన చంద్రబాబు నాయుడుని ఆయన పొగడటం, హైదరాబాద్‌లో రోడ్లు అద్భుతంగా ఉన్నాయని పొగడటం ద్వారా ఏపీలో రోడ్ల దుస్థితిపై విమర్శించిన్నట్లు భావించి ఏపీ మంత్రులు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనుక జైలర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో రజనీకాంత్ వారందరికీ ఈవిదంగా సమాధానం చెప్పిన్నట్లు అర్దమవుతోంది.
అయితే ఆయన ఎవరి పేరు ఎత్తకుండా ఈ విమర్శలు చేసినందున వైసీపీ నేతలు చీమ కుట్టినట్లు మౌనంగా భరించకతప్పడం లేదు. ఒకవేళ స్పందిస్తే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకొన్నట్లు అవుతుంది. అప్పుడు వారే నవ్వులపాలవుతారు కనుక. అయితే భోళాశంకర్‌కు చుక్కలు చూపిస్తున్నట్లే ఇక జైలర్ సినిమాకు కూడా ఏపీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందేమో?
ఇంతకీ రజనీకాంత్ ఏమాన్నారంటే, “ఇదివరకు నాకు సూపర్ స్టార్ బిరుదు ఇస్తానంటే వద్దన్నాను. శివాజీ గణేశన్, కమల్‌హాసన్ వంటి సూపర్ స్టార్స్ ఉండగా ఇంకో సూపర్ స్టార్ అవసరమా?అని నేను వెనక్కు తగ్గాను. అప్పుడు నన్ను చాలామంది విమర్శించారు. మళ్ళీ ఇప్పుడూ ఆలంటి సమస్యే వస్తోంది. మొరగని కుక్కా లేదు, విమర్శించని నోరూ లేదు... ఈ రెండూ లేని ఊరూ లేదు. కనుక నేను వాటిని పట్టించుకోకుండా నాపని నేను చేసుకుపోతాను,” అని అన్నారు.