నేడు మహేష్ బాబు పుట్టినరోజు.. గుంటూరు కారం నుంచి మరో పోస్టర్‌

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా త్రివిక్రం శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ఏవైనా అప్‌డేట్ వస్తుందేమోనని అభిమానులు ఎదురుచూస్తుంటే, ఈ సినిమాను నిర్మిస్తున్న హారికా అండ్ హాసినీ క్రియెషన్స్‌ నిన్న సాయంత్రం ఓ పోస్టర్‌ విడుదల చేసింది.  

దానిలో లుంగీ కట్టుకొన్న మహేష్ బాబు ఓ బల్ల మీద కూర్చొని నోట్లో బీడీని వెలిగించుకొంటున్నట్లు చూపారు. గుంటూరు కారం నుంచి ఇంతకు మించి అభిమానులు ఆశిస్తే కేవలం ఓ పోస్టర్‌తో సరిపెట్టేయడం కాస్త నిరాశ కలిగించి ఉండవచ్చు. అయితే ఈ సినిమా విడుదలయ్యేందుకు ఇంకా చాలా సమయం ఉంది కనుక మరికొన్ని రోజుల తర్వాత వరుసపెట్టి అప్‌డేట్స్ రావచ్చు. 

ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా మీనాక్షీ చౌదరి నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌ. శ్రీ వైరా వెంకటస్వామిగా కీలకపాత్ర చేస్తున్నారు.   

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. గుంటూరు కారం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది.