మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా భోళాశంకర్ సినిమా మరో మూడు రోజులలో (ఆగస్ట్ 11) విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ మీడియాతో భోళాశంకర్ సినిమా, దానిలో చిరంజీవి గురించి మీడియాతో ఆసక్తికరమైన విషయాలు పంచుకొన్నారు.
“చిరంజీవి నాకు కజిన్ బ్రదర్. కనుక ఆయనను అన్నయ్య అంటూ పిలిచే చనువు నాకుంది. నేను చిన్నప్పటి నుంచి అన్నయ్య సినిమాలు చూస్తూ పెరిగాను. కానీ ఏదో ఓ రోజు అన్నయ్యను నేనే డైరెక్ట్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ నాకు అటువంటి అద్భుతమైన అవకాశం అన్నయ్య కల్పించారు.
ఆయన సెట్స్‌లో ఉంటే చాలా సరదా ఉంటారు. తన పని అయిపోయిన తర్వాత కూడా సెట్స్‌లోనే తిరుగుతూ అందరితో హాయిగా కబుర్లు చెప్పుకొంటూ కాలక్షేపం చేస్తారు. ఆయన సెట్స్‌లో ఉంటే అందరికీ షూటింగ్‌లో ఉన్నట్లు కాక ఏదో పిక్నిక్‌కి వచ్చిన్నట్లు హాయిగా ఉంటుంది. ఈసారి 120 రోజులు అన్నయ్యతో ఈ పిక్నిక్ ఎంజాయ్ చేశాము. సినిమా కధ, ఇతర అంశాలపై తన అభిప్రాయాలు చెపుతుంటారు కానీ అదే పాటించాలని ఎన్నడూ ఒత్తిడి చేయరు.
ఇది తమిళ సినిమా వేదాళంకు రీమేక్ అయినప్పటికీ దానికీ దీనికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ చిరంజీవిని నేను ఏవిదంగా చూడాలనుకొన్నానో, అభిమానులు ఎలా చూడాలని కోరుకొంటారో అలా చూపించాను. కనుక భోళాశంకర్ అభిమానులందరికీ పెద్ద పండగే.
ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్ర చాలా భావోద్వేగాలతో ఉంటుంది. దీనికి కీర్తి సురేశ్ అయితేనే చక్కగా సరిపోతుందని అనుకొని ఆమెను అడగగానే మారుమాట చెప్పకుండా వెంటనే ఒప్పేసుకొన్నారు. తమన్నా, సుశాంత్ పాత్రలు కూడా దీనిలో అద్భుతంగా వచ్చాయి.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆనాడు గ్యాంగ్ లీడర్ వంటి సినిమాని చూసినప్పుడు ఎటువంటి ఫీలింగ్ కలుగుతుందో భోళాశంకర్‌తో కూడా సరిగ్గా అటువంటి యంగ్ చిరంజీవిని మళ్ళీ చూశామనే తృప్తి, సంతోషం అందరికీ కలుగుతాయని నమ్మకంగా చెప్పగలను,’ అని మెహర్ రమేష్ అన్నారు.
భోళాశంకర్‌లో మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, కాశి విశ్వనాథ్, బ్రహ్మాజీ, వేణు, సుశాంత్, ఉత్తేజ్, రవిశంకర్, హైపర్ ఆది, తరుణ్ అరోరా, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి, గెటప్ శ్రీను, షావార్ ఆలీ, సితార, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేశారు.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర కలిసి నిర్మించిన ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, డైలాగ్స్: మామిడ్ల తిరుపతి, కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, ఫోటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ అందించారు.