
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే జంటగా తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898-ఎడి’ సినిమాను 2024, జనవరి 12న విడుదల చేస్తామని ఇంతవరకు చెప్పారు. కానీ ఈ సినిమా వాయిదా పడబోతోందనే ఊహాగానాలు వినిపిస్తుండటంతో దర్శకుడు నాగ్ అశ్విన్ వివరణ ఇచ్చారు. అయితే ఆయన కూడా అవి నిజమే అన్నట్లు మాట్లాడటం విశేషం.
నాగ్ అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం నా దృష్టి అంతా ఆ సినిమా షూటింగ్ మీదే ఉంది. త్వరలోనే అది పూర్తవుతుంది. తర్వాత ఓ మంచి రోజు చూసుకొని సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తామో నేనే స్వయంగా చెపుతాను. ఈ సినిమాలో ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాను. ఇప్పటి వరకు ప్రభాస్ అటువంటి లుక్‌లో ఎన్నడూ కనిపించలేదు. కనుక ఓ మంచి అనుభూతిని ఈయబోయే ఈ సినిమా కోసం అందరూ కాస్త ఓపికగా వేచి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
అంటే జనవరి 12న సినిమా విడుదలవకపోవచ్చన్న మాట. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విషయంలో ఎదురైన విమర్శలను దృష్టిలో ఉంచుకొని నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ సినిమాను అంతర్జాతీయస్థాయిలో తీస్తున్నందున హాలీవుడ్ స్థాయిలోనే విఎఫ్ఎక్స్ చేయిస్తున్నారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్న కల్కి 2898-ఎడిలోకి బిగ్-బి అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ వంటివారిని తీసుకోవడం గమనిస్తే ఇదేమీ ఆషామాషీగా చుట్టబెట్టేస్తున్న సినిమా కాదని నాగ్ అశ్విన్ చెప్పకనే చెప్పారు. ఈ సినిమాలో దిశా పఠానీ, బ్రహ్మానందం, సల్మాన్ దుల్కర్, సూర్య తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: డానీ సాంజెక్ లోపెజ్, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు.