
పి.వాసు దర్శకత్వంలోనే రజనీకాంత్ హీరోగా 2005లో చంద్రముఖి సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. నిజానికి చంద్రముఖి సినిమాకి సీక్వెల్ తీద్దామని దర్శకుడు పి.వాసు రజనీకాంత్‌ని అడిగితే ఆ స్థాయిలో చేయలేకపోతే పేరు పాడవుతుందని నో చెప్పేశారు. ఆయన ఊహించిన్నట్లే ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ దానికి సీక్వెల్‌గా నాగవల్లి చేసినా అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత పి.వాసు దర్శకత్వంలోనే ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ రాఘవ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలలో చంద్రముఖి-2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో కంగనాను తీసుకొన్నప్పుడే పెద్ద సంచలనం అయ్యింది. ఎందుకంటే సాధారణంగా ఆమె ఏది పడితే అదే చేసేయదు. సినిమాల విషయంలో చాలా సెలక్టివ్‌గా ఉంటుంది. కనుక చంద్రముఖి-2 కధ గొప్పగానే ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
ఈ సినిమాలో రాఘవ లారెన్స్ రాజుగారి పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి ఏడాది సెప్టెంబర్‌లో వినాయక చవితి పండుగ రోజున విడుదల చేయబోతున్నారు. కనుక సినిమా మెల్లగా సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి ఇటీవలే రాఘవ లారెన్స్ ఫస్ట్-లుక్ విడుదల చేశారు. తర్వాత నర్తకి రూపంలో ఉన్న కంగనా రనౌత్ ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇంతవరకు ఆమె చేసిన పాత్రలకు పూర్తిభిన్నమైన వేషధారణతో కనిపించింది.
చంద్రముఖి-2లో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, వడివేలు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో నిర్మిస్తున్న చంద్రముఖి-2 సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.