ప్రముఖ బాలీవుడ్‌ ఆర్ట్ డైరెక్టర్ నితిన్‌ దేశాయ్ ఆత్మహత్య

నాలుగు జాతీయ అవార్డులు అందుకొన్న ప్రముఖ బాలీవుడ్‌ ఆర్ట్ డైరెక్టర్ నితిన్‌ దేశాయ్ (57) మంగళవారం రాత్రి ముంబైకి సుమారు 100 కిమీ దూరంలో కర్జత్ పట్టణంలో తన ఎన్‌డీ స్టూడియోలో ఆత్మహత్య చేసుకొన్నారు. ఇది బాలీవుడ్‌లో అందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి. మంగళవారం తన స్టూడియోకి వెళ్ళిన నితిన్‌ దేశాయ్ అక్కడే ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆయన ఆత్మహత్యకి కారణం ఇంకా తెలియవలసి ఉంది. 

దాదాపు రెండు దశాబ్ధాలుగా బాలీవుడ్‌తో బలమైన అనుబందం ఉన్న నితిన్‌ దేశాయ్ దాదాపు అందరూ పెద్ద హీరోలు అగ్రదర్శకులతో కలిసి పనిచేశారు. 1942: ఏ లవ్ స్టోరీ, హమ్ దిల్‌ దే చుకే సనం, స్లమ్ డాగ్ మిలియనీర్, లగాన్, దేవదాస్, జోధా అక్బర్, ట్రాఫిక్ సిగ్నల్, పానీపట్ వంటి అనేక సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా ఆయన వేసిన సెట్స్‌ బాలీవుడ్‌ని మరోస్థాయికి తీసుకువెళ్ళాయి.

సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్‌ హిందీ వెర్షన్‌ నితిన్‌ దేశాయ్‌కి చెందిన ఎన్‌డీ స్టూడియోలోనే నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మహారాణాప్రతాప్ అనే హిందీ వెబ్‌ సిరీస్‌కు పనిచేస్తుండగా ఆత్మహత్య చేసుకొన్నారు.