
ఆదివారం జరిగిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టిఎఫ్‌సిసి) ఎన్నికలలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్యానల్ విజయం సాధించింది. ప్రతీ రెండేళ్ళకోసారి జరిగే ఈ ఎన్నికలలో నిర్మాతలు దిల్‌రాజు, మాజీ అధ్యక్షుడు సి కళ్యాణ్ పోటీ పడగా దిల్‌రాజు ప్యానల్ 17 ఓట్ల తేడాతో విజయం సాధించింది. కనుక రాబోయే రెండేళ్లపాటు దిల్‌రాజు టిఎఫ్‌సిసి అధ్యక్షుడుగా వ్యవహరించబోతున్నారు. ఆయన ప్యానలో పోటీ చేసి గెలిచిన ముత్యాల రామరాజు ఉపాధ్యక్షుడిగా, దామోదర్ ప్రసాద్ కార్యదర్శిగా, ప్రసన్నకుమార్ కోశాధికారిగా వ్యవహరించబోతున్నారు.
టిఎఫ్‌సిసిలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు (సినిమా హాల్స్ యజమానులు), స్టూడియోల యజమానులు కలిపి మొత్తం 2099 మంది సభ్యులు ఉండగా వారిలో 1339 మంది తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, వెంటనే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించారు.
ఈ ఎన్నికల ప్రక్రియపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిశిత విమర్శలు చేశారు. గతంలో కూడా టిఎఫ్‌సిసి ఎన్నికలు జరిగేవని, తాను కూడా టిఎఫ్‌సిసి అధ్యక్షుడుగా పనిచేశానని చెప్పారు. అప్పుడు టిఎఫ్‌సిసిలో చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేవని అన్నారు. కానీ ఇప్పుడు ఇవేవో శాసనసభ ఎన్నికలన్నట్లు ఇరు వర్గాలు హోరాహోరీగా పోరాడుకోవడం చూస్తే చాలా భయం వేస్తోందన్నారు. ఎవరు అధ్యక్ష పదవి చేపట్టిన సినీ పరిశ్రమకు మేలు చేసేందుకు గట్టిగా ప్రయత్నించాలని హితవు చెప్పారు.