సారీ పుష్పా... ఐటెమ్ సాంగ్‌ చేసేదేలే!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందనల పుష్ప-1 ఓ సూపర్ హిట్. దానిలో “ఊ అంటావా మావా... ఉఊ అంటావా...” అంటూ సాగే ఐటెమ్ సాంగ్‌ సూపర్ హిట్. ఆ పాటకు సమంత చేసిన డ్యాన్స్ ఇంకా సూపర్ హిట్! కనుక పుష్ప-2లో అటువంటి ఐటెమ్ సాంగ్‌ చేయాలని చాలామంది హీరోయిన్లు ఆశపడుతుంటారు. కానీ టాలీవుడ్‌ తాజా సెన్సేషన్ శ్రీలీల మాత్రం ఆ ఆఫర్‌కు నో చెప్పేసిందిట! 

పుష్ప-1లో ఐటెమ్ సాంగ్‌కు వచ్చిన క్రేజ్ చూసి పుష్ప-2లో ఎవరైనా టాప్ బాలీవుడ్‌ హీరోయిన్‌ చేత చేయించాలనుకొన్నారట సుకుమార్. కానీ యూనిట్‌లో అందరూ శ్రీలీల చేత చేయించాలని పట్టుబట్టడంతో దర్శకనిర్మాతలు ఆమెను అడిగితే ఆమె సున్నితంగా తిరస్కరించింది.

ప్రస్తుతం వరుసపెట్టి ఓ అరడజనుకు పైగా సినిమాలు చేస్తుండటం, కెరీర్‌ పీక్ దశకు చేరుకొంటున్న ఈ సమయంలో ఐటెమ్ సాంగ్‌ చేస్తే, ఆ ప్రభావం తన కెరీర్‌ మీద పడుతుందని చెపుతూ సున్నితంగా ఈ ఆఫర్ తిరస్కరించిన్నట్లు తెలుస్తోంది. ఈ ఐటెమ్ సాంగ్‌ కోసం భారీగా అమౌంట్ ఆఫర్ చేసినా ఆమె నో చెప్పిందట! ఆమె మంచి నిర్ణయమే తీసుకొన్నట్లు భావించవచ్చు. 

శ్రీలీల నో చెప్పేసింది గనుక ఇప్పుడు పుష్ప-2లో ఐటెమ్ సాంగ్‌ కోసం ఎవరిని తీసుకొంటారో చూడాలి. పుష్ప-1లో నటించిన ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో పాటు దీనిలో మరికొంతమంది నటీనటులు వస్తున్నారు. వారిలో జగపతి బాబు కూడా ఒకరు. ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు.

తెలుగు, తమిళ్, కన్నడ, మలాయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్పా-2 సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. 

ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. పుష్ప2 ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2024 సంక్రాంతి పండుగకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.