ఈ జన్మకు ఇది చాలు బ్రో: సముద్రఖని

ఈ నెల 28న బ్రో విడుదల కాబోతుండటంతో ఆ సినిమా దర్శకుడు సముద్రఖని ఈ సినిమా గురించి కొన్ని ముచ్చట్లు మీడియాతో పంచుకొన్నారు. 

తమిళంలో ఈ సినిమా ‘వినోదాయ సిత్తం’ తీస్తున్నప్పుడు కోవిడ్ ఉండేది. కనుక ఈ సినిమాలో కాలచక్రం పాత్రలో నటించడానికి నేను కోరుకొన్న నటులు ఎవరూ దొరక్కపోవడంతో ఆ పాత్ర నేనే చేయవలసివచ్చింది. అయితే ఈ సినిమా గురించి విన్న త్రివిక్రం శ్రీనివాస్‌ ఈ కధ ఎక్కువమందికి చేరాలంటే కొంచెం మార్పులు చేసి పవన్‌ కళ్యాణ్‌తో తీద్దామన్నప్పుడు ఆయన ఆలోచన, ప్రతిపాదనకు నేను చాలా పొంగిపోయాను. 

నా గురించి ఆయనకు సునీల్ ద్వారా తెలిసింది. అప్పటి నుంచి నా సినిమాలను ఆయన నిశితంగా చూస్తున్నారట! అందుకే నన్ను పవన్‌ కళ్యాణ్‌తో చేయమని ఆయనే ప్రోత్సహించారు. నేను కూడా రచయితనే కానీ తెలుగు భాషపై త్రివిక్రం శ్రీనివాస్‌కున్న పట్టు నాకు లేదు కనుక ఆయనతోనే డైలాగ్స్ వ్రాయించుకొన్నాను. 

పవన్‌ కళ్యాణ్‌ని కలిసి ఈ కధ చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయాను. కధ వినిపించడం పూర్తికాగానే అయితే “ఈ సినిమా ఎప్పటి నుంచి మొదలుపెడదాం?” అంటూ ప్రశ్నించేసరికి నేను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. ‘రేపంటే రేపే మొదలుపెట్టడానికి నేను సిద్దంగా ఉన్నానని’ చెప్పగానే ‘అలాగే కానిద్దాం...’ అంటూ పవన్‌ కళ్యాణ్‌ కూడా ఒకే చెప్పేశారు. ఆవిదంగా పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రం శ్రీనివాస్‌లతో బ్రోలో నా ప్రయాణం మొదలైంది. 

పవన్‌ కళ్యాణ్‌ సెట్స్‌కు రాగానే ముందుగా అందరూ సిద్దంగా ఉన్నారా?ఇంకా ఏవైనా ఏర్పాట్లు జరుగుతున్నాయా? అని పరిశీలిస్తారు. ఆయన వైపు నుంచి ఎన్నడూ షూటింగ్‌ ఆలస్యం కాదు. సెట్స్‌లోనే డ్రెస్ మార్చేసుకొని మేకప్ వేసుకొని రెడీ అయిపోతారు. ఆయన సింప్లిసిటీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. 

ఈ సినిమాలో కాలచక్రం అంటే భగవంతుడి పాత్ర పోషిస్తున్నారు కనుక షూటింగ్‌ జరుగుతున్నాళ్ళు పవన్‌ కళ్యాణ్‌ ఉపవాసం చేశారు. అంత పెద్ద నటుడు అయ్యుండి సెట్స్‌లో ఇంత క్రమశిక్షణతో ఉంటూ, అందరితో హాయిగా కబుర్లు చెపుతూ స్నేహంగా వ్యవహరిస్తుండటం చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. 

‘వినోదాయ సిత్తం’ చేసిన తర్వాత మరిక చేయవలసిందేమీ లేదనిపించింది. కానీ ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో ‘బ్రో’ చేస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువే సంతోషం, తృప్తి పొందాను. ఈ జన్మకు ఇది చాలనిపించింది,” అని బ్రోతో తన అనుభూతులను అభిమానులతో పంచుకొన్నారు.