
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలలో రెండు పడవల ప్రయాణం చేస్తుండటం ఇటు దర్శకనిర్మాతలకు, అటు జనసేన పార్టీ నేతలకు చాలా ఇబ్బందికరంగా మారింది. సముద్రఖని దర్శకత్వంలో ‘బ్రో’ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేసినప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల పరిస్థితి ఏమిటో తెలీదు.
బ్రో సినిమా టీజర్ రిలీజ్‌కు ముందు పవన్ కళ్యాణ్ భీమవరంలో రాజకీయ యాత్ర చేస్తుండటంతో సముద్రఖని అక్కడకు వెళ్ళి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ చేత డబ్బింగ్ చెప్పించుకోవలసి వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చాలా బిజీగా ఉండటంతో బ్రో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారా లేదా?అని చాలామంది అనుమాన పడ్డారు. అయితే మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్, శిల్పాకళావేదికలో నిర్వహిస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు.
బ్రో సినిమాలో సాయి ధరం తేజ్, కేతిక శర్మా, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలలో నటించారు.
బ్రోఈ నెల 28న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తెలంగాణలో ఎటువంటి ఆటంకాలు ఉండవు కానీ ఏపీలో మాత్రం చాలా ఆటంకాలు ఎదురవవచ్చని దర్శక నిర్మాతలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. బహుశః అందుకే ఏపీలో బెనిఫిట్ షోలు వేసుకొనేందుకు, మొదటి 10 రోజులు టికెట్ ధర పెంచుకోవడానికి అనుమతి కోరి ఉండకపోవచ్చు.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.